పారదర్శకంగా ప్రత్యేక ఓటరు జాబితా: ఎలక్షన్ అబ్జర్వర్ చేతన్
కడప,: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ చేతన్ ERO, AROలను ఆదేశించారు.
కడప కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో గురువారం అబ్జర్వర్ చేతన్, జేసీ డా. నిధీమీనా, డిఆర్వో మల్లికార్జునుడులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అబ్జర్వర్ చేతన్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమీషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమీషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా నమోదులో వివరాలు.పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనలు పాటిస్తే తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు.
బిఎల్వోలు క్షేత్రస్థాయిలో 100 శాతం ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. ప్రతి ఓటర్ల జాబితాని పరిశీలన చేయాలని, బిఎల్వోలకు శిక్షణ కూడా ఇవ్వాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు వారి ఫిర్యాదులను ముందుగానే అందించాలని, క్షేత్రస్థాయిలో నాయకులకు తెలియజేసి అందరూ సహకరించేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా జేసీ డా. నిధీమీనా జిల్లాలో ఎస్.ఐ. ఆర్. నిర్వహణ గురించి వివరిస్తూ... జిల్లాలో మొత్తం 18,96,231 మంది ఓటర్లు ఉండగా, జూలై 24 నాటికి 64,434 మంది (3.40 శాతం) మ్యాపింగ్ కాని ఓటర్లు, 2,43,180 మంది (12.82 శాతం) మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు ఉన్నట్లు జేసీ డా. నిధిమీనా తెలిపారు. కడప నియోజకవర్గంలో అత్యధికంగా 25,538 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నారని వివరించారు.
ఆగస్టు 20 నాటికి 3,07,685 నోటీసులను 100 శాతం జనరేట్ చేశామని, ఎక్కడా పెండింగ్ లేదని తెలిపారు. జిల్లాలోని 2,251 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బీఎల్‌ఓ–బీఎల్‌ఏ సమావేశాల మినిట్స్ కూడా పూర్తిగా అప్‌లోడ్ చేశామని వెల్లడించారు.
ఫారాలు 9, 10, 11, 11ఏ, 11బీ ప్రచురణ అనంతరం ఏడు రోజుల నోటీసు గడువు ముగిసిన వెంటనే ఫారాలు 6, 6ఏ, 7, 8 పరిష్కార ప్రక్రియ చేపట్టాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ చేతన్ టి.ఎస్. సూచించినట్లు జేసీ తెలిపారు. సెప్టెంబర్ 21లోపు నోటీసుల ప్రక్రియ, సెప్టెంబర్ 28లోపు విచారణలు, తుది ఉత్తర్వులు పూర్తి చేయాలని సూచించినట్లు వివరించారు.
అలాగే ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించి, బీఎల్‌ఓలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా వచ్చిన 3,162 ఫిర్యాదుల్లో 3,098 మూసివేసి, 49 పరిష్కరించామని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 2,251 కేంద్రాలను 2,444కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కొత్తగా 193 కేంద్రాల ఏర్పాటు, 20 కేంద్రాల మార్పు, 20 కేంద్రాల పేర్ల మార్పునకు ప్రతిపాదనలు పూర్తయ్యాయని జేసీ డా. నిధిమీనా వివరించారు.
ఈ సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.