అక్రమ మద్యాన్ని నియంత్రించాలి.. రాబడి పెంచాలి: కమిషనర్ శ్రీధర్
కడప(ఆగస్ట్, 11): ఆబ్కారీ శాఖకు నిర్దేశించిన రాబడి లక్ష్యాలను సాధించడంతో పాటు అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టాలని రాష్ట్ర మధ్యపాన నిషేధం, ఆబ్కారీ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో మంగళవారం ఆబ్కారీ రాబడి, శాఖాపరమైన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ చామకూరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అబ్కారీ శాఖ పనితీరును సమీక్షించారు.
మూడు జిల్లాల్లో నిర్ణయించిన ఆబ్కారీ రాబడి లక్ష్యాలు, సాధించిన పురోగతి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
అక్రమ మద్యం రవాణా, నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
*సమావేశంలో కడప డిప్యూటీ కమిషనర్ జయరాజు, నెల్లూరు డిప్యూటీ కమిషనర్ శంకరయ్య, కడప అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్‌తో పాటు వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల జిల్లా నిషేధ, ఆబ్కారీ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, స్టేషన్ హౌస్ అధికారులు పాల్గొన్నారు.