జిల్లాలో 3,07,685 మందికి నోటీసులు.!
కడప: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కు వివరించారు.
గురువారం విజయవాడ నుండి SIR నిర్వహణ, పురోగతిపై.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో.. కడప జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొని, జిల్లాలో ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించారు.
జిల్లాలో మొత్తం 3,07,685 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా అన్నింటినీ జారీ చేశామని, ఇప్పటివరకు 2,51,371 నోటీసులు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే 32,949 విచారణలు పూర్తిచేసినట్లు వివరించారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో భాగంగా ఫారం–6, ఫారం–7, ఫారం–8 ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి ధ్రువీకరణ, ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఫారం–7 కింద 2,66,041 దరఖాస్తులు అందగా, వాటిలో 2,62,915 దరఖాస్తులు ఆమోదించబడినట్లు వివరించారు.
పెండింగ్‌లో ఉన్న నోటీసుల పంపిణీ, విచారణలు, క్లెయిమ్‌లు – అభ్యంతరాల పరిష్కారం, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్డు మీటింగ్ హాలు నుండి డీఆర్వో మల్లికార్జునుడు, ఎస్డీసి వెంకటపతి, సంబంధిత ఎన్నికల, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.