22 నాటికి స్మార్ట్ కిచెన్ల విస్తరణ పూర్తి చేయాలి: కలెక్టర్

కడప: జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు చేపట్టిన స్మార్ట్ కిచెన్ల విస్తరణ ఈనెల 22లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్  సంబంధిత అధికారులను ఆదేశించారు. 
శనివారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో పాటు ఆయా మండలాల ఎంఈవోలతో వీసీ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. 
జిల్లా వ్యాప్తంగా 38 స్మార్ట్ కిచెన్ల ద్వారా లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. 
జిల్లాలో ఇంకా స్మార్ట్ కిచెన్ల పరిధిలోకి తీసుకురావాల్సిన 369 పాఠశాలలకు అనుసంధాన ప్రక్రియ, రవాణా మార్గాల గుర్తింపును వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆహార సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న పాఠశాలలకు సంబంధించి రవాణా సమయాలను పునఃపరిశీలించి, సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 
స్మార్ట్ కిచెన్లలో వాహనాల స్టాండింగ్ షెడ్లు, వాహనాల నిలుపుదల వేదికలు, రక్షణ కంచెల నిర్మాణం వంటి పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు, శుద్ధి చేసిన తాగునీటి వ్యవస్థలు, బోరుబావులు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వంటశాలల్లో ఏర్పాటు చేసిన బయో వ్యర్థాల శుద్ధి పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.
వంటశాలలకు అవసరమైన కూరగాయలు, ఇతర వంట సరుకులను ముందస్తు ప్రణాళికతో సేకరించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమీప కొనుగోలు కేంద్రాలను గుర్తించాలని సూచించారు. విద్యార్థుల నమోదు సంఖ్య తక్కువగా ఉన్న 13 ప్రాధాన్య ప్రాంతాల్లో వంటశాలల అవసరాలకు అనుగుణంగా కూరగాయల తోటలను ఏర్పాటు చేయాలన్నారు. మండలాల వారీగా ఖాళీలను పరిశీలించి అర్హులైన పాఠశాల వంట సహాయకులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విబిజీ రామ్ జీ, ఉద్యాన శాఖ, ఏపీఎంఐపి శాఖల సమన్వయంతో.. ఆయా పాఠశాలల పరిధిలో న్యూట్రీ కిచెన్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేపట్టాలన్నారు.
సమావేశంలో డీఈవో శంశుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపిసి అనురాధ, స్మార్ట్ కిచెన్ల నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసులు, ఏపీ సీఎన్ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, పౌర సరఫరాలు, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!