మండపాల వద్ద అవగాహన: SI రాఘవేంద్ర రెడ్డి
ప్రొద్దుటూరు 2టౌన్ ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి గురువారం గణేష్ మండపాల వద్ద ప్రజలతో సమావేశం నిర్వహించారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గణేష్ మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, రాత్రి వేళల్లో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్.ఐ. రాఘవేంద్ర రెడ్డి కోరారు.