స్పర్శ తెలియని మచ్చలపై పరీక్షలు చేయించుకోవాలి.!
ప్రొద్దుటూరులో మంగళవారం కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు ప్రచార (LCDC) కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా గీత మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వైకల్యాలను నివారించవచ్చన్నారు. కుష్ఠువ్యాధి కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11 నుండి 24వ తేది వరకు ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను పరిశీలించి, కుష్ఠు వ్యాధి అనుమానిత కేసులను గుర్తిస్తారన్నారు. చర్మంపై స్పర్శ తెలియని తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు, మచ్చల వద్ద స్పర్శ తగ్గడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి, నరాలు మందంగా అనిపించడం వంటి లక్షణాలను గుర్తించడం జరుగుతుంది. కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే వైకల్యాలను నివారించవచ్చని, ప్రజలు కుష్ఠు వ్యాధిపై ఉన్న అపోహలను వీడి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కుష్ఠు వ్యాధి ఉన్నవారిపై వివక్ష చూపకుండా వారికి సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ,ప్రజలకు ముఖ్య సందేశం ఏమనగా “కుష్ఠువ్యాధిని ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స పొంది అంగ వైకల్యాలను నివారిద్దాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి పి యం ఓ శివశంకరయ్య, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ జయపాల్, సి ఓ నాగజ్యోతి మరియు సిబ్బంది పాల్గొన్నారు.