గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి:ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరులో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ సూచించారు.
శనివారం స్థానిక తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ASP విభూకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న కమిటీలకు చెందిన సుమారు 200 మంది సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ASP విగ్రహ ప్రతిష్ఠాపన, ఊరేగింపు, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాటించాల్సిన నిబంధనలను వివరించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి కమిటీ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించాలని కోరారు.
ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, ప్రొద్దుటూరు II టౌన్ ఇన్‌స్పెక్టర్ వంశీనాథ్, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.