ఆగస్ట్ 15 నాటికి పెండెన్సీ జీరో చేయాలి: జిల్లా కలెక్టర్ శ్రీధర్
కడప(జూలై,28): భూ సంబంధిత అర్జీలపై త్వరితగతిన స్పందించినప్పుడే సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని బోర్డు సమావేశ మందిరంలో భూ సంబంధిత రెవెన్యూ సమస్యలు, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ నిధీ మీనాతో కలిసి ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున చేపట్టే ప్రతి పని ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని, సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, సమస్యలు, అభ్యంతరాలను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయిలో పరిష్కరించి పెండెన్సీని "సున్నా" స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పెండింగ్ లోవున్న అన్ని రెవెన్యూ సమస్యలను పరిష్కరించి పట్టాదారు పసుపుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. మండల స్థాయిలో ప్రతి వారం, జిల్లా స్థాయిలో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తూ అందిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందించాలని తెలిపారు.
సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఎస్డీసి వెంకటపతి, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు మురళి, శిరీష, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ వేణుగోపాల్, అన్ని మండలాల తహశీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.