రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించాలి: DMHO యుగంధర్

ప్రొద్దుటూరు:గుడ్ సమారిటన్, ప్రమాద బాధితుల రక్షణ జోహా స్కీం మార్గదర్శకాలపై ప్రైవేటు ఆసుపత్రులకు అవగాహన సమావేశం గురువారం ప్రొద్దుటూరులో DMHO యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. DMHO మాట్లాడుతూ..  రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు జాప్యం లేకుండా వైద్య సహాయం అందించాలని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి తీసుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని ఆదేశించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు, వారికి స్వచ్ఛందంగా సహాయం చేసే వ్యక్తులకు చట్టపరమైన రక్షణ ఉందని వివరించారు.  ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు.  ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పోలీసు విచారణ, ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తికాలేదనే కారణంతో వైద్యం అందించడంలో జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. బాధితుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే అత్యవసర వైద్యం అందించాలని వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు.
ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో గుడ్ సమారిటన్, జోహా పథకం, పీఎం రహత్ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు స్పష్టంగా కనిపించే ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.  ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని ఏపి క్లినికల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకొని, హాస్పిటల్ చార్జెస్ ప్రజలకు కనపడేలా ఉంచాలన్నారు.  
ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారులు డా గీత, ఖాజా మొహిద్దీన్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డా. ఆంజనేయులు, NTR హెల్త్ యూనివర్సిటీ కౌన్సిల్ మెంబెర్ డా. వరుణకుమార్ రెడ్డి, IMA డా. శంకర రెడ్డి, సెక్రటరి డా. హేమలత, డెమో భారతి, డిప్యూటీ  హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సిఓ సుబ్బారెడ్డి, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.