DLCOకు MLA లేఖ.!

ప్రొద్దుటూరు సహకార గృహ నిర్మాణ సంఘంలో ఉద్యోగి కళ్యాణ్ నియామకంలో జరిగిన అక్రమాలపై బాధ్యులైన పాలకవర్గ సభ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంగళవారం  డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు.  నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు సంబంధిత విచారణలో నిర్ధారణ అయినట్లు గతంలో కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 21-AA(C) ప్రకారం సంబంధిత పాలకవర్గ సభ్యులు అనర్హతకు గురైనట్లు నివేదికలో పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని లేఖలో ప్రస్తావించారు.  విచారణ నివేదికలో నిర్ధారించిన అంశాల ఆధారంగా బాధ్యులైన పాలకవర్గ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అక్రమ నియామకంపై కూడా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోరారు.  ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఎమ్మెల్యే తన లేఖలో కోరారు.
ఈ లేఖ ప్రతులను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా సహకార అధికారికి కూడా పంపించారు.