మధుమేహ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి: డా. గీత

ప్రొద్దుటూరు: ఆరోగ్యకరమైన జీవనశైలితో మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చని జమ్మలమడుగు డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గీతా తెలిపారు.  శనివారం స్థానిక శ్రీరాములపేట సచివాలయంలో మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా డా. గీత మాట్లాడుతూ.. వంశపారంపర్య కారణాలు, అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో మధుమేహ వ్యాధి వస్తుందన్నారు.  మందులు వాడాలన్నారు.  
నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తామని, మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే దీర్ఘకాలిక వ్యాధి అని తెలిపారు.
పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలని,వైద్యుల సూచన మేరకు మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు.మధుమేహం వల్ల గుండె, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గడం, నరాల బలహీనత, పాదాలకు పుండ్లు వస్తాయన్నారు.
మధుమేహ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన వైద్య చికిత్స తీసుకోవాలని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యన్సిడి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా భరత్ నారాయణ, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.