ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ బకాయిల వ్యవహారం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన హరీష్ రెడ్డి

ప్రొద్దుటూరు: ఎగ్జిబిషన్‌కు సంబంధించి మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిల వసూలు అంశం హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరుకు చెందిన టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ మనిషి హరీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎగ్జిబిషన్ నిర్వహణకు నిర్వహించిన వేలంలో కాంట్రాక్టర్ శివకుమార్ అత్యధికంగా రూ.1,85,00,070తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి మొత్తం రూ.2,18,30,082కు వేలం దక్కించుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే నిర్వాహకుడు ఇప్పటివరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించగా, మరో రూ.1,63,30,082 బకాయి ఉన్నట్లు హరీష్ రెడ్డి తన అఫిడవిట్‌లో తెలిపారు.
పూర్తి వేలం మొత్తం చెల్లించకుండానే ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకుండా ఎగ్జిబిషన్‌లోని ఆటవస్తువులు, యంత్రాలను తరలించేందుకు అనుమతిస్తే మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ ఆదాయం పట్టణ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరుతుందని, ఆ ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హరీష్ రెడ్డి తన పిటిషన్‌లో వివరించారు. బకాయిల వసూలుకు ఆటంకం కలగకుండా తనను కేసులో నాలుగో ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టును కోరారు.