హైకోర్టును ఆశ్రయించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులు.. నేడు విచారణ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు సంబంధించిన అమ్యూజ్మెంట్ రైడ్స్, ఇతర పరికరాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అనుమతించడం లేదని ఆరోపిస్తూ వ్యాపారులు షేక్ హుస్సేన్(ప్రొద్దుటూరు), షణ్ముఖం(కడప) ఏపీ హైకోర్టును(WPNO.34187/2026) ఆశ్రయించారు. మంగళవారం విచారణ జరగనుంది.
MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప జిల్లా కలెక్టర్, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ లను ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టులో పిటిషన్ వేశారు.
మున్సిపాలిటీ నిర్వహించిన బహిరంగ వేలంలో మదులపల్లి శివకుమార్ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచారని, ఆయనతో తాము వేర్వేరుగా ఒప్పందాలు చేసుకుని ఎగ్జిబిషన్ పరికరాలను ఏర్పాటు చేశామని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే వేలంలో పాల్గొన్న బిడ్డర్ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో, తమకు చెందిన పరికరాలను తొలగించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు.
వేలం బకాయిలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, పరికరాలు తమ సొంత ఆస్తులని పిటిషనర్లు స్పష్టం చేశారు. వాటిని అక్కడే ఉంచడం వల్ల వ్యాపారానికి నష్టం కలగడంతో పాటు యంత్రాలు పాడయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు.
తమ పరికరాలను సురక్షితంగా తొలగించుకునేందుకు అనుమతించాలని, వేలం బకాయిల పేరుతో వాటిని నిర్బంధించకుండా మున్సిపల్ అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.
*ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ రూ.1.63 కోట్లు చెల్లించాల్సి ఉంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పూర్తి అమౌంట్ చెల్లించిన తర్వాతే ఎగ్జిబిషన్ నిర్వహణకు కమిషనర్ అనుమతించాలి. కాగా కమిషనర్ విశ్వనాథ్ గెజిట్ నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ అప్పగించారు.
*ఇందులో కమిషనర్ కాంట్రాక్టర్ లాలూచి పడి మున్సిపల్ ఖజానాకు రూ.1.63 కోట్లు నష్టం కలిగించారని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్, వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, కాంగ్రెస్ ఇంచార్జి ఇర్ఫాన్ బాషా, ప్రజా పక్షం పార్టీ అధ్యక్షులు పుత్త లక్ష్మిరెడ్డి ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు.