టౌన్ బ్యాంక్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం.. డిసెంబర్ 7న ఓటింగ్.!
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డిపై బ్యాంక్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఈమేరకు శుక్రవారం 11 మంది డైరెక్టర్ల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీసును ప్రొద్దుటూరు DLCO సత్యానందకు అందజేశారు. 12 మంది డైరెక్టర్లలో 11 మంది సంతకాలు చేశారు. కొంతకాలంగా చైర్మన్ సుబ్బారెడ్డి పనితీరు, వ్యవహారశైలిపై డైరెక్టర్లు అసంతృప్తిలో ఉన్నారు. బోర్డు సమావేశాలను సైతం బాయికాట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక టిడిపి నాయకత్వం బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డిని రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆయన అందుకు ఒప్పుకోక పోవడంతో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు.
*ఈ మేరకు ప్రొద్దుటూరు డిఎల్సిఓ సత్యానంద్ డిసెంబర్ 7న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ డైరెక్టర్లకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక సమావేశంలో బ్యాంకు చైర్మన్ సుబ్బారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ఓటింగ్ నిర్వహిస్తారు. 12 మంది డైరెక్టర్లలో 11 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నారు.
*టిడిపికి చెందిన తనపై స్వంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం పెట్టించారంటూ ఆరోపిస్తూ ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు చైర్మన్ సుబ్బారెడ్డి టిడిపి మాజీ నియోజకవర్గ ఇన్చార్జి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.