అద్దె లావాదేవీల్లో జీఎస్టీ నిబంధనలను పాటించాలి: జాయింట్ కమిషనర్ సుమతి
కడప, డిసెంబర్ 13: అద్దె చెల్లింపులకు సంబంధించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనలు, రివర్స్ ఛార్జ్ విధానం (ఆర్‌సీఎం) అమలుపై పన్ను నిపుణులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పన్నుల శాఖ కడప డివిజన్ జాయింట్ కమిషనర్ జి.సుమతి సూచించారు.
శనివారం కడపలోని "మానస ఇన్" హోటల్‌లో రాష్ట్ర పన్నుల శాఖ కడప డివిజన్ ఆధ్వర్యంలో అద్దెలపై జీఎస్టీ, రివర్స్ ఛార్జ్ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
అద్దె చెల్లించే వ్యక్తి, అద్దె పొందే వ్యక్తికి జీఎస్టీ చట్టం ప్రకారం ఉండే బాధ్యతలను వివరించారు. పన్ను చెల్లింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిటర్నులలో నమోదు చేయాల్సిన వివరాలు, సంబంధిత నిబంధనలను తెలియజేశారు.
జీఎస్టీ చట్టం ప్రకారం అద్దెలపై పన్ను వర్తించే సందర్భాలు, పన్ను చెల్లించాల్సిన బాధ్యతలు, నమోదు అవసరాలు, పన్ను వివరాలను దాఖలు చేసే విధానాలపై స్పష్టత కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పన్ను నిపుణులు అడిగిన పలు సందేహాలను ఆమె నివృత్తి చేశారు. పన్ను చెల్లింపుదారులు చట్టంలోని నిబంధనలను పాటిస్తూ, నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించాలని సూచించారు.
ఆడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. షరీఫ్ ఖాన్ మాట్లాడుతూ అద్దెలపై జీఎస్టీ, రివర్స్ ఛార్జ్ విధానంపై పన్ను నిపుణులకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సదస్సులో జిల్లాకు చెందిన ఆడిటర్లు, పన్నుల శాఖలో నమోదు చేసుకున్న పన్ను ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర పన్ను నిపుణులు పాల్గొన్నారు. జీఎస్టీ నిబంధనల అమలుపై శాఖాధికారులు, పన్ను నిపుణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.