ఓటుకు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఇల్లూరు వాసులు.!
ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లూరు గ్రామానికి చెందిన 377 మంది ఓటర్లు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్ (W.P. No. 34945/2026) సహా మరికొన్ని ఎన్నికల పిటిషన్లపై జస్టిస్ కిరణ్మయి మండవ నవంబర్ 27, 2026న ఉమ్మడి తీర్పు ఇచ్చారు.
ఎన్నికల ప్రచారం సమయంలోను, పోలింగ్ రోజున కూడా అభ్యర్థులు, మద్దతుదారులకు తగిన రక్షణ కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరుతూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. తాము ఇచ్చిన వినతులపై అధికారులు నిర్ణయం తీసుకోవడం లేదని వారు పిటిషన్లలో పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం (SEC) వివరణ: ఎన్నికల భద్రత, పర్యవేక్షణ, కౌంటింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సర్క్యులర్లు జారీ చేసిందని, వీటితో పిటిషనర్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు
ఓటర్లు ఎటువంటి భయం లేకుండా ఓటు వేసేందుకు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. బెదిరింపులు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, పోలింగ్, కౌంటింగ్‌కు పూర్తి శాంతిభద్రతల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నందున ఈ పిటిషన్లపై కొత్తగా మరో విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది
ఎన్నికల అధికారులు, పోలీసులు తప్పనిసరిగా ఎస్ఈసీ సర్క్యులర్లు మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలను కఠినంగా పాటించాలని ఆదేశించింది.
ఈ సూచనలతో పిటిషన్లను పరిష్కరిస్తూ (డిస్పోజ్ చేస్తూ) ఉత్తర్వులు ఇచ్చారు.
ఎన్నికల్లో ఓటర్లు, అభ్యర్థులు నిర్భయంగా పాల్గొనవచ్చని, ఎన్నికల సంఘం మరియు పోలీసుల నిబంధనల మేరకు భద్రతా ఏర్పాట్లు అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.