ప్రొద్దుటూరులో కథా స్రవంతి పరిచయ సభ.!
ప్రొద్దుటూరు: చైతన్య సాహిత్య కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం "కథా స్రవంతి" కథా సంకలనం పరిచయ సభ జరిగింది. పలువురు సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సభలో పల్లా కృష్ణ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా సాహితీ వేత్త కె.బాబు సంపాదకత్వంలో "కథాస్రవంతి" కథా సంకలనం ప్రచురించడం సంతోషదాయక విషయమన్నారు. ఇందులో 45 మంది ప్రముఖ కథారచయితల కథలు ఉన్నాయన్నారు, వివిధ ప్రాంతాల నుంచి కథలను సేకరించి సంకలనం చేయడం వల్ల ఇతర ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు పాఠకులకు తెలిసి, ప్రాంతాల మధ్య సమైక్య భావన కలుగుతుందన్నారు. ఇలాంటి గొప్ప కథా సంకలనంలో కాశీవరపు వెంకటసుబ్బయ్య కథ "ప్రతీకారం" చోటు చేసుకోవడం చాల ఆనందంగా ఉందన్నారు. కొత్తపల్లె శీను "ప్రతీకారం" కథను సమీక్షిస్తూ ప్రతీకారం కథ రాయలసీమకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కథ సాగునీటి సమస్య తీవ్రత గురించి చెప్పుతూ అది ఎలా ఫ్యాక్షన్ కు దారి తీస్తుందో తెలుపుతుందన్నారు. ప్రతీకారం కథను కాశీవరపు వెంకటసుబ్బయ్య చాల నేర్పుగా ప్రతిభను జోడించి రాశారని ప్రశంసించారు. కథలో కనుమరుగవుతున్న కడప జిల్లా మాండలిక పదాలు ఉపయోగించారన్నారు. పల్లా రామారావు, అడపా రామకృష్ణ గారి కథ "సరోగసి మదర్" పై మాట్లాడారు. మహమూద్, ఎన్ కె బాబు కథ "(ఆ) ధర్మకర్త" కథమీద ఉపన్యసించారు. ఆవుల శ్రీనివాస్ బులుసు అపర్ణ గారి " ఆనందలహరి" కథను సమీక్షించారు. బసవరాజు వేణు గోపాల్ వడలి రాధాకృష్ణ "తనలోని వాడు" కథను వివరిస్తూ మాట్లాడారు. గజ్జెల వెంకటేశ్వర రెడ్డి పి బాల త్రిపుర సుందరీ "నిన్ను తండ్రిలా పెంచుకుంటారు" కథ మీద మాట్లాడారు.
కవి గాయకుడు నీలం బాలగంగాధర తిలక్, భుక్యా గోపాల్ నాయక్ లు ఉపన్యసించారు.