"పొగాకు రహిత యువత" పై ప్రచారం: డా. గీత

ఎర్రగుంట్ల: "పొగాకు రహిత యువత" ప్రచారంలో భాగంగా సోమవారం ఎర్రగుంట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. గీత మాట్లాడుతూ.. యువతలో పొగాకు వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.  పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా, జర్దా తదితర పదార్థాల వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయన్నారు.  చిన్న వయస్సులోనే పొగాకు అలవాటుకు బానిసలైతే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పొగాకు వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని, పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు.
సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధమన్నారు. 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధం వంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యువతను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా జ్యోష్ణ, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఇ ఓ రవిశంకర రాజు, ప్రధానోపాధ్యాయులు శైలజ, సూపర్ వైజర్  కృష్ణ కుమారి, టొబాకొ కౌన్సిలర్ సుమలత, ఉపాధ్యాయులు, ఏ యన్ యం మరియు ఆశలు పాల్గొన్నారు.