అన్యాయంగా తొలగించారు.. కోర్టు స్టే ఇచ్చింది: భాస్కర్ రెడ్డి

 
ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీ పాలకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే పిర్యాదుతో అధికారులు అన్యాయంగా రద్దు చేశారని.. హైకోర్టు తమకు అనుకూలంగా స్టే ఇచ్చిందని చైర్మన్ భాస్కర్ రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. మేనేజింగ్ కమిటీని రద్దు చేస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల విధించింది. సంబంధిత సొసైటీ మేనేజింగ్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
*విచారణకు దారితీసిన అంశాలు
సొసైటీలో క్లర్క్‌ను తొలుత తాత్కాలిక ప్రాతిపదికన నియమించి, అనంతరం క్రమబద్ధీకరించడంలో అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై అధికారులు సెప్టెంబర్ 25న షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు.
అయితే, వివరణ సమర్పించేందుకు అవసరమైన కార్యాలయ మెమో, విచారణ నివేదికతో పాటు నోటీసులో పేర్కొన్న కొన్ని కీలక పత్రాలను అధికారులు అందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
*ఈ వ్యవహారంపై గతంలో దాఖలైన W.P.No.28798 of 2026ను అక్టోబర్ 5న విచారించిన హైకోర్టు, అవసరమైన పత్రాలను రెండు వారాల్లో అందించాలని ఆదేశించింది. అలాగే పిటిషనర్ వివరణ సమర్పించి, అధికారులు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించింది.
అయినప్పటికీ, అక్టోబర్ 29, 30 తేదీల్లో అధికారులు మేనేజింగ్ కమిటీని రద్దు చేస్తూ తదుపరి చర్యలు చేపట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక అధికారిగా నియమించిన ఓ.కమల విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపినట్లు, బాధ్యతలు స్వీకరించకముందే మరో ఐదుగురి పేర్లను ప్రతిపాదించినట్లు కూడా కోర్టుకు వివరించారు.
*అధికారుల ఉత్తర్వులపై హైకోర్టు అభ్యంతరం
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, షోకాజ్ నోటీసుకు సంబంధించిన ఆధారాలు, అవసరమైన సమాచారాన్ని ముందుగా పిటిషనర్‌కు అందించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. సంబంధిత పత్రాలు ఇవ్వకుండా తదుపరి చర్యలు చేపట్టిన పరిస్థితులపై అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
*డిసెంబర్ 7కు తదుపరి విచారణ
అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, అక్టోబర్ 29న జారీ చేసిన ఉత్తర్వులు, అక్టోబర్ 30న జారీ చేసిన తదుపరి ఉత్తర్వుల అమలును తదుపరి విచారణ వరకు నిలిపివేసింది.
ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం డిసెంబర్ 7, 2026కు వాయిదా వేసింది.