చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్.. రూ.4.04లక్షలు స్వాధీనం.!
ప్రొద్దుటూరు: స్థానిక మోడంపల్లి చాకలి వీధికి చెందిన చౌడం రాజారామ్ ఇంట్లో ఈనెల 8న రూ.5,10,000/- నగదు చోరీ జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 2టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 123/2026 U/Sec 331(4), 305(a) BNSగా కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రొద్దుటూరు SDPO సూచనల మేరకు 2 టౌన్ ఇన్స్పెక్టర్ P.వంశీనాథ్ తన సిబ్బందితోటి బృందాలుగా ఏర్పడి, పలుకోణాలలో విచారించడము జరిగింది. ఆదివారం స్థానిక మండి బజార్ రోడ్డులోని మారుతి అపార్ట్మెంట్ పక్కన గల ఖాళీ స్థలంలో ముగ్గురు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన నగదులో రూ.4,04,000/- నగదును స్వాధీనం చేసుకోవడమైనది. మిగిలిన డబ్బును వారు తమ అవసరాలకు ఖర్చు చేసినట్లుగా వెల్లడించారు.
రెండు రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేసి, దొంగిలించబడిన నగదులో అధిక మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ P. వంశీనాథ్, SI S. మహబూబ్ బాషా, పోలీస్ సిబ్బందిని ప్రొద్దుటూరు SDPO బాలస్వామి రెడ్డి అభినందించారు.
ఈ కేసును సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో చాలా తక్కువ సమయంలో ఛేదించి, దొంగలించిన సొమ్మును చాలా వరకు రికవరీ చేసినందున, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, షాపుల వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రజలు తమ ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు తెలియచేసారు.