కడప కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు.!

న్యూఢిల్లీ / కడప: పొద్దుటూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు ప్రశాంత్ తనను స్థానిక మున్సిపల్ అధికారులు రూ.30 వేల లంచం డిమాండ్ చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, జీతం నిలిపివేశారని ఆరోపిస్తూ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC)కు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు 2026 నవంబర్ 2వ తేదీన అందిన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా కల్పించిన అధికారాల మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి 2026 నవంబర్ 3వ తేదీన కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను నోటీసు అందిన 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. బాధితుడి పేరు, చిరునామా, ఘటన వివరాలు, నమోదైన ఎఫ్‌ఐఆర్ వివరాలు, నిందితులపై తీసుకున్న చర్యలు, పరిహారం చెల్లింపు వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించింది.
నిర్ణీత గడువులోగా నివేదిక అందకపోతే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలను వినియోగించి సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కమిషన్ తన నోటీసులో పేర్కొంది.
ఈ నోటీసుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు సంతకం చేశారు.