నకిలీ తాళంచెవితో చోరీ.. మహిళ అరెస్ట్.!

ప్రొద్దుటూరు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో నకిలీ తాళంచెవి ఉపయోగించి బంగారు ఆభరణాలు చోరీ చేసిన మహిళను స్థానిక 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 58.857 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2.40 లక్షలు ఉంటుందన్నారు.  
1టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్సై మొయిద్దీన్ వివరాల మేరకు..
ప్రొద్దుటూరు జడలగారి వీధికి చెందిన సుజాత కుటుంబ సభ్యులతో కలిసి చీరల వ్యాపారం నిమిత్తం అక్టోబర్ 4న హైదరాబాద్‌కు వెళ్లారు. అక్టోబర్ 5న ఇంటికి తిరిగి వచ్చి చూడగా బీరువాలోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైం నం.199/2026, U/s 331(3), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో జడలగారి వీధికి చెందిన రుద్రాల రమాదేవిపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పులు తీర్చుకునేందుకు సుజాత ఇంట్లో చోరీ చేయాలని పథకం వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
సుజాత వద్ద నుంచి తాళం చెవి వివరాలు తెలుసుకున్న రమాదేవి, శివాలయం సెంటర్ సమీపంలోని తాళాలు తయారు చేసే వ్యక్తి వద్ద అసలు తాళం చెవికి నకిలీ తాళం చెవి తయారు చేయించుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో అక్టోబర్ 4న మధ్యాహ్నం ఇంటి తాళం తెరిచి బీరువాలోని లాకర్ నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు వెల్లడించారు.
పోలీసులు ఆమె వద్ద నుంచి బ్రాస్‌లెట్, పాపిడి బిళ్ల, మూడు ఉంగరాలు, మహిళల బ్రాస్‌లెట్, రెండు బంగారు చైన్లు, రెండు చైన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 58.857 గ్రాములు, విలువ సుమారు రూ.2,40,000గా పోలీసులు తెలిపారు.  ఈ కేసులో నిందితురాలిని అక్టోబర్ 7న రాత్రి అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మోయినుద్దీన్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ప్రొద్దుటూరు ASP విభూకృష్ణ అభినందించారు.