పోలీసులపై దాడికి యత్నించిన రౌడీ షీటర్ అరెస్ట్: సీఐ కొండారెడ్డి
ప్రొద్దుటూరు: రామేశ్వరం ఆలయ భూముల వేలంపాటను అడ్డుకున్న రౌడీషీటర్ ను అరెస్ట్ చేసినట్లు స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు..
బుధవారం మధ్యాహ్నం రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క భూములను వేలంపాట వేసే క్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ గారి అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును నిర్వహించడమైనది. ఆలయ భూములను వేలంపాట నిర్వహించరాదని దొరసాని పల్లికి చెందిన రౌడీషీటర్ పాతకోట వినోద్ కుమార్ రెడ్డి వేలం పాట నిర్వహిస్తున్న టూరిజం బిల్డింగ్ వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులు హెచ్చరించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మరియు ఇతర పోలీస్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ నెట్టి వేయడం జరిగింది. ఈ క్రమంలో రౌడీ షీటర్ వినోద్ కుమార్ రెడ్డి పోలీసులు ఎంత వారిస్తున్న వినకుండా వేలంపాట ఆపాలి లేకపోతే మీ అంతు చూస్తానని బెదిరించాడు. ఆలయ ఈఓపై దాడికి ప్రయత్నిస్తుండగా, పోలీస్ సిబ్బంది అడ్డుపడుతున్నారని అక్కడే ఉన్న పెద్ద బండరాయితో హెడ్ కానిస్టేబుల్ దస్తగిరిపై దాడి చేయగా, హెడ్ కానిస్టేబుల్ తప్పించుకున్నాడు. రౌడీషీటర్ వినోద్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, ప్రొద్దుటూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కలదు. నిందితుడు వినోద్ కుమార్ రెడ్డి పై బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడమైనది.
*ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరైనా రౌడీషీటర్స్ శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన ఎడల వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని ప్రొద్దుటూరు ASP విబుకృష్ణ హెచ్చరించారు.