విద్యుత్ వైర్ల చోరీ ముఠా అరెస్ట్: ASP విభూకృష్ణ
ప్రొద్దుటూరు: విద్యుత్ వైర్ల చోరీ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, వారి నుంచి రికవరీ చేసినట్లు ASP విభూకృష్ణ బుధవారం మీడియాకు తెలిపారు.
రూరల్ పోలీస్ స్టేషన్ నందు నమోదు అయిన సోములవారిపల్లె జగనన్న కాలనీ లో జరిగిన అల్ల్యుమినియం కరెంట్ వైర్ మరియు ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనము కేసు దర్యాప్తులో భాగంగా 23.09.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. నాగభూషణ్ గారి ఆధ్వర్యంలో SI K.C. రాజు మరియు సిబ్బంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు అనుమానితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి, వారు సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న వాహనాలను వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని వెంబడించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు నిందితులు కాగా, ఒకరు చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు (Juvenile in Conflict with Law). వారితో ఉన్న ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా, వారు సుమారు సంవత్సర కాలం నుండి ముఠాగా ఏర్పడి రామేశ్వరం జగనన్న కాలనీతో పాటు ప్రొద్దుటూరు మరియు రాజుపాళెం మండలాల్లోని వివిధ గ్రామాల్లో విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను లక్ష్యంగా రాత్రి పూట చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
పోలీసుల విచారణలో నిందితులు దొంగిలించిన వైర్లను గుజరీ వ్యాపారులకు విక్రయించి, తద్వారా వచ్చిన నగదును తమలో పంచుకుని వినియోగించినట్లు వెల్లడైంది. నిందితులు ఇచ్చిన సమాచారాన్ని సేకరించి, వాటిని సంబంధిత కేసులతో సరిపోల్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల చర్యలు:
నిందితుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో స్పాట్ వెరిఫికేషన్, కేసుల వారీగా ఆధారాల పరిశీలన మరియు దొంగసొత్తు గుర్తింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు రూరల్ మరియు రాజుపాళెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించిన దొంగసొత్తును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో రాజుపాళెం PS కి చెందిన రెండు ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనం కేసులు మరియు ప్రొద్దుటూరు రూరల్ PS చెందిన రెండు ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనం కేసులు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
నిందితుల సమాచారం మేరకు అల్ల్యుమినియం కరెంట్ వైర్ 56 కేజీల సర్వీస్ వైర్, ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించు 05 కేజీల కాపర్ వైర్ తో పాటు కరెంట్ వైర్ మరియు రాగి వైర్ అమ్మగా వచ్చిన నగదు రూ.5,40,000/- ముద్దాయి ల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దొంగతనాలకు ఉపయోగించినట్లు గుర్తించిన ఒక బజాజ్ ఆటో, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, ఒక TVS యాక్టివా స్కూటీ, అలాగే ఇనుప యాక్స బ్లేడ్ సెట్లు, ఒక ఇనుప గొడ్డలి, ఒక సుత్తి మరియు నిచ్చెన మరియు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తును సంబంధిత కేసులతో అనుసంధానం చేసి, కేసుల దర్యాప్తులో భాగంగా అవసరమైన ఆధారాలను నమోదు చేశారు. నిందితులు గతంలో ఇదే తరహాలో మరిన్ని దొంగతనాలకు పాల్పడ్డారా, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులతో వారికి సంబంధం ఉందా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల వివరాలు:
1. పోలిశెట్టి వెంకటేశ్వర్లు, 37 సంవత్సరాలు, ప్రొద్దుటూరు టౌన్.
2. మద్దికం కృష్ణయ్య, 41 సంవత్సరాలు, ప్రొద్దుటూరు టౌన్.
3. ముక్కమల్ల మహేష్, 38 సంవత్సరాలు, రామాపురం, ప్రొద్దుటూరు మండలం.
4. మాలికి సాయి కిరణ్, 26 సంవత్సరాలు, చౌటపల్లె, ప్రొద్దుటూరు మండలం.
5. పొలంకి రంగనాయకులు, 25 సంవత్సరాలు, ప్రొద్దుటూరు టౌన్.
6. ఇల్ల చందు, 15 సంవత్సరాలు – చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు (Juvenile in Conflict with Law).
స్వాధీనం చేసుకున్న దొంగసొత్తు:
1. నగదు రూ.5,40,000/-
2. 56 కేజీల సర్వీస్ వైర్ (అల్యూమినియం/సిల్వర్ వైర్)
3. 05 కేజీల కాపర్ వైర్ (ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించు)
నేరానికి ఉపయోగించిన వాహనాలు, సామగ్రి:
1. బజాజ్ మూడు చక్రాల ఆటో – AP04 Y 8242
2. బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ – AP39 GQ 9839
3. TVS యాక్టివా స్కూటీ – AP39 EF 7292
4. రెండు ఇనుప యాక్స బ్లేడ్ సెట్లు
5. ఒక ఇనుప గొడ్డలి
6. ఒక సుత్తి
7. ఒక నిచ్చెన
తదుపరి పోలీసుల చర్యలు:
పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అతని ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ, అతని కదలికలపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
అలాగే అరెస్ట్ చేసిన నిందితులపై నమోదైన కేసులు, వారి గత నేర చరిత్ర, ఇతర ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ వైర్లు మరియు ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలతో ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన గుజరీ వ్యాపారుల పాత్రపై కూడా అవసరమైన విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
ప్రజలకు ASP U. విభు కృష్ణ సూచనలు – ముందస్తు చర్యలు
ఎలక్ట్రికల్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల విషయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ASP, ప్రొద్దుటూరు U. విభు కృష్ణ సూచించారు. ఎలక్ట్రికల్ వైర్ దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాత్రి గస్తీ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల తనిఖీలు, కీలక ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు, విద్యుత్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల సంచారం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని ప్రజలను కోరారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, నేరాలకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ సందర్భంగా ASP, ప్రొద్దుటూరు U. విభు కృష్ణ గారు CI M. నాగ భూషణ్, SI K.C. రాజు, హెడ్ కానిస్టేబుళ్లు దేవదాస్, కొండయ్య, కానిస్టేబుళ్లు సునీల్, శేఖర్ రెడ్డి, అచ్చయ్య, సుధాకర్లను అభినందించారు.